కర్మ - జన్మ
"ఇతరులు నీకు ఏది చేస్తే ప్రతికూలంగా ఉంటుందో నీవు దాన్ని ఇతరులకు చేయకూడదు, ఇతరులు ఏది చేస్తే నీకు అనుకూలంగా ఉంటుందో దానిని నీవు ఇతరులకి చేయాలి" అని మహాభారతంలో చెప్పబడింది. అనేక గ్రంథాలలో విశదీకరించి సమస్త ధర్మాల సారాంశం ఇది.
వేగంగా పెరిగే ఒక తీగ కొబ్బరిచెట్టు కాండాన్ని అల్లుకుని పెరిగింది. ఆ తీగ "నేనెంత త్వరగా పెరిగి నిన్ను అల్లుకున్నానో చూడు. అతి గర్వంతో నువ్వు ఒక్క అంగుళం కూడా పెరగలేవు " అని బడాయించింది
ఆ కొబ్బరిచెట్టు చిన్నగా నవ్వి "వేలకొద్దీ తీగలు నాతో ఇదే మాటన్నాయి. గాలి తాకిడికి అవన్నీ వెళ్లిపోయాయి. నేను మాత్రం బలంగా ఇక్కడే ఉన్నాను" అన్నది.
హిందూ సనాతన ధర్మం ఈ కొబ్బరిచెట్టు లాంటిది. కర్మ సిద్దాంతం హిందు మతానికి మూల స్తంభాలలో ఒకటి . కర్మంటే ఏమిటి? కర్మ ఫలం ఎప్పుడు, ఎలా లభిస్తుంది? ఏ కర్మ ఏటువంటి ఫలితాన్ని ఇస్తుంది? సంచిత కర్మ ఫలాన్ని అనుభవించకుండా ముందుగానే నాశనం చేసుకోవడం ఎలా? అనే ప్రశ్నలకు సమాధానమే "కర్మ-జన్మ" అనే పుస్తకం.
ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు చాల సంవత్సరాల పాటు అనేక హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక గ్రంథాలను, పురాణ ఇతిహాసాలను సమగ్రంగా అధ్యయనం చేసి తెలుగులో కర్మ సిద్ధాంతాన్ని సమగ్రంగా వివరించే "కర్మ-జన్మ" పుస్తకాన్ని రచించారు .
అయితే చాలాకాలంగా కర్మ జన్మ పుస్తకం మార్కెట్లో లేదు. చదివే వారు ఉన్నారు కాని కొనేవారు లేరని ప్రచురించడం లేదని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న చార్టెడ్ అకౌంటెంట్ దమ్మవళం శ్రీనివాస్ గారు తన జీవితంలో చాలా పెద్ద మార్పును తెచ్చిన పుస్తకానికి కృతజ్ఞతగా పుస్తకం ధర రూ.320/- లో రూ.220/- ప్రచురణ కర్తకు ముందుగానే చెల్లించి పాఠకులకి కేవలం రూ.100/- లకే అందుబాటులోకి తెచ్చారు.
నేను ఇటీవల ప్రభాకర్ జైని గారి పోస్టు చూసి మల్లాది గారిని వాట్సప్ ద్వారా సంప్రదించాను. వారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ ఆశ్చర్యంగా ఈరోజు నాకు పోస్టు ద్వారా ఒకటి కాదు రెండు పుస్తకాలు అందాయి. కర్మ జన్మ పుస్తకాన్ని బంధుమిత్రులలో ఎవరికైనా బహుమతిగా ఇవ్వమని సూచన.
పుస్తకాన్ని నేను ఇంకా చదవలేదు కాని ఒకసారి పైపైన తిరగేసి చెబుతున్న ఈ పుస్తకం మీరు జీవితంలో చదివిన అద్భుతమైన పుస్తకాల్లో ఒకటిగా నిలుస్తుంది. తప్పకుండా చదవండి అని రికమెండ్ చేస్తున్నాను
0 Comments