మనిషి ఎదగాలంటే కష్టాలు ఉండాలి..!
ఎదురుబొంగు అందరికి తెలిసిందే, చూసే ఉంటాం . అది చాల బలహీనమైన నేల అయినా, బలమైన నేల అయినా నిటారుగా ఎటువంటి వంపులు లేకుండా పెరుగుతుంది. అది దాని లక్షణం.
నిజానికి వెదురు ద్రుఢమైన మొక్క కాదు. అయినా ఎంత ఎత్తు ఎదిగినా ఎంత పెద్ద గాలికి అయినా వెదురు సులభంగా విరగదు. ఎంత పెద్ద గాలులు వీచినా, తుఫానులు వచ్చినా వేటిని పట్టించుకోకుండా వెదురు ఎదుగుతూనే ఉంటుంది. కారణం అది ఎర్పరచుకునే గణుపులు (జాయింట్స్).
ఎదిగే క్రమం లో ప్రతి 8 నుంచి 12 అంగుళాల దూరం లో వెదురు గణుపులని అంటే జాయింట్లని ఏర్పరచుకుంటుంది. మొదట్లో ఈ గణుపులు పెద్దవిగా ఉంటై, పైకి పోయినకొలదీ చిన్నవవుతూ ఉంటై. వెదురు 30 అడుగులు లేదా 60 అడుగుల ఎత్తు పెరిగినా తన ద్రుఢత్వాన్ని కోల్పోదు మరియూ వంగే స్వభావాన్ని కోల్పోదు.
జీవితం లో మనిషి లాగే వేగం గా పెరిగే మొక్క వెదురు. అయితే ప్రతి 8 నుంచి 12 అంగుళాల ఎత్తు పెరిగాక వెదురు పెరగటం ఆపుకొని ఎంతో ప్రతిఘటన, స్తబ్దత కి గురి అయ్యి గణుపులని (జాయింట్లని) ఏర్పరచుకుంటుంది. ఇది వెదురుకి చాలా బాధాకరం గా ఉంటుంది, ఆ సమయం లో నేను ఎదగలేకపోతున్నా అని నరకయాతన పడుతుంది. కానీ వెదురు కి తెలుసు మధ్య మధ్యలో గణుపులని ఏర్పరచుకోలేకపోతే తాను మరింత ఎత్తుకు ఎదగలేను అని. ఈ గణుపులే లేకపోతే సులువుగా విరిగిపోతుంది, నిటారుగా 60 లేదా 70 అడుగుల ఎత్తు ఎదగలేదు.
మనిషి కి కూడా అంతే..అప్పుడప్పుడూ కష్టాలు లేకపోతే నిజమైన ఎదుగుదల ఉండదు. కష్టాలని అద్రుష్టం గా భావించి ఎదుగుదలకి మెట్లుగా, గణుపులుగా ఉపయోగించుకోవాలి అంటారు పెద్దలు.
ఏ రంగం లో విజయం సాధించిన ఏ వ్యక్తిని తీసుకున్నా వాళ్లు పడిన కష్టాలు, గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, వాళ్లు ఏర్పరచుకున్న గణుపులు ఎన్నో ఉంటై. అందుకే కష్టం వచ్చినప్పుడు బాధ గా ఉన్నా వాటిని విజయానికి గణుపులు (జాయింట్స్)గా ఎర్పరచుకొని దాన్ని మరింత ఎదగటానికి ఉపయోగించుకోవాలి..!
0 Comments