నష్టజాతకురాలని/ నష్ట జాతకుడ్ని, నాకు ఏమీ కలిసి రాదు

నష్టజాతకురాలని/ నష్ట జాతకుడ్ని, నాకు ఏమీ కలిసి రాదు

 నేను నష్టజాతకురాలని/ నష్ట జాతకుడ్ని, నాకు ఏమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే...అని కొన్ని సందర్భాల్లో అనిపించటం సహజం. రోజు రోజుకీ ప్రపంచం, మన చుట్టు పక్క పరిసరాలు, సమాజం చాలా మారుతుంది.

జీవితం లో జీవితాన్ని మించినది లేదు. జీవించి ఉండటమే విజయం, చావే ప్రతి మనిషి కి అపజయం.
మనం ఉన్న సమాజం లో కంపారిజన్స్ కామన్. గెలిస్తే విపరీతం గా పొగుడుతారు. ఓడిపోతే దారుణం గా విమర్శిస్తారు. ఎలా గెలిశారు లేదా ఎలా ఓడిపోయారు అనేది చాలా మటుకు ఎవరూ పట్టించుకోరు, పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు సమాజానికి.
ఫలానా దాంట్లో చదివిన వాళ్ళకి క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో సంవత్సరానికి కోటి జీతం అని సమాజమే అదేదో గొప్ప అని విపరీతం గా పొగుడుతారు, అదే సమాజం మళ్ళీ ఫెయిల్ అయినందుకు అత్మహత్య చేసుకోవాలా అని నిలదీస్తుంది. సిగ్గూ, ఇజ్జత్ లేని సమాజం లో బతుకుతూ మన ఇజ్జత్ గురించి అసలు ఆలోచించకూడదు.
ఇదోక అడవి. ఒకొకరు ఒకో జంతువు లా ప్రవర్తిస్తారు, మనిషి పుటుక పుట్టారు అని అందరూ మనుష్యులు కాదు, మనుష్యుల్లా ప్రవర్తించరు. ఈ ప్రపంచం లో ఎవరిని అడ్డం గా కోసినా, నిలువుగా నరికినా కనిపించేవి వాళ్ళ "అవసరాలు, కోరికలు, గుర్తింపు" మాత్రమే. అందుకే పొగిడినా, విమర్శించినా పెద్దగా పట్టించుకోకూడదు.
మనం మోసపోటానికి రడీ గా ఉంటే మోసం చేసేవాళ్ళు చుట్టు పక్కలా కొన్ని వేల, లక్షల, కోట్ల మంది ఉంటారు. అలా అని మోసపోవటం తప్పు కాదు, దాని నుంచి నేర్చుకోవాలి.
చిన్నప్పటి నుంచి నాకు చదువులో ఫస్ట్, సెకండ్ తప్ప థర్డ్ ప్లేస్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇంకా ఫెయిల్ అంటే నా డిక్షనరీ లోనే లేదు. అలాంటిది రేపు Ph.D వస్తుంది అనగా, ఈ రోజు ఫెయిల్ చేశారు అమెరికా లో. కార్ వేసుకొని అట్లాంటిక్ మహా సముద్రం దగ్గరికి వెళ్ళా. తెల్లారితే పట్టాభిశక్తుడై రాజ్యాన్ని పాలించే రాముడే అడవులకి వెళ్ళాడు, పంచ భక్ష పరమన్నాలు తింటూ అష్టైశ్వర్యాలు అనుభవించే పాండవులు అరణ్యవాసం చేశారు. నేను ఎంత, నా ఫెయిల్యూర్ ఎంత అని నాకు నేనే సర్ది చెప్పుకొని బతకటం ప్రారంభించాను. జీవితం లో అత్యున్నతమైన స్థితిని చూశా, అత్యంత లోతైన అగాథాలని చూశా. ఒక్క మాట లో చెప్పాలి అంటే నాకున్న కష్టాలు హైదరాబాద్ లో ఉన్న కోటి మందికి పంచినా ఇంకా కొన్ని మిగిలే ఉంటై. అయినా జీవితం కొనసాగిస్తున్నా కారణం జీవితం లో జీవించి ఉండటానికి మించిన విజయం ఇంకోటి లేదు.
సైకిల్ నేర్చుకునేటప్పుడు క్రింద పడకుండా ఎవరూ సైకిల్ తొక్కటం మంచిగా నేర్చుకోలేరు, జీవితం లో కూడా అంతే. కొంతమందికి కొన్ని, కొన్ని రకాలు గా కుదురుతాయి అలా అని వాళ్ళు ఎల్లకాలం ఉండరు, వాళ్ళూ చస్తారు. అ తర్వాత వాళ్ళ శవం కూడా మట్టిలో కలుస్తుంది లేదా పురుగులు తింటాయి.
ఏ విషయం లో ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. మనకి కలిసి రావటం లేదు, అవతలి వాళ్ళకి కలిసి వస్తుంది అనిపించటం తాత్కాలికం. కాని అది నిజం కాదు, జీవితం నిజం. మనల్ని మనం తెలుసుకోవటమే జీవితం. సుఖం, దుఃఖం, కంపారిజన్స్ అన్నీ అశాశ్వతం.
మనతో మనం 24 గంటలు ఉంటాం. మన భార్య/ భర్త/ పిల్లలు/ తల్లి తండ్రులు/ సిబ్లింగ్స్/స్నేహితులు/ సమాజం - ఎవరూ మనతో రోజుకి 24 గంటలు ఉండరు; అందుకే మన గురించి మనం ఏమనుకుంటున్నం అనేది ముఖ్యం. సమాజం ఒక వేశ్య / వేశ్యుడు, దానికి అనిపించింది అది అనుకుంటుంది కానీ ఈ ప్రపంచం లో నీకు నీవు ఏమనుకుంటున్నవ్ అనేది ముఖ్యం. ఈ ప్రపంచం అంతటా వెతికినా నీలా ఏ ఒక్కరూ ఉండరు అందుకే మానవ జన్మ అత్యున్నతమైనది, నువ్వే విజయం.
మన జీవితం లో "జీవితం" ని మించిన గొప్పది ఏదీ లేదు అది ఎలా ఉన్నా..!

Post a Comment

0 Comments

Advertisement