diwakarla tirupati sasri అజరామర కీర్తి పొందిన మహానుభావుడు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు

diwakarla tirupati sasri అజరామర కీర్తి పొందిన మహానుభావుడు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు

 


దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు!!

తెలుగు పద్యానికి ప్రాణం పోసి అజరామర కీర్తి పొందిన మహానుభావుడు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు. ఆ మహానుభావుని జయంతి సందర్భంగా వారిని ఒక్కమారు స్మరిద్దాం!

మధురము, మనోజ్ఞమూ, రాగశోభితమూ, రసరంజితమైన లలిత సుందర పదబంధాలను
పద్యంగా విరచిస్తే - అది అనవద్యంగా, హృద్యంగా ధ్వనిస్తుంది.

విశ్వవినువీధుల్లో మధుర సుమధురంగా రవళిస్తున్న పద్యక్రియ అచ్చమైన తెలుగువాడి సొత్తు. గుండెలోతుల్లోనుండి ఉబికిన పద్యం కంఠ
నాళాలమధ్య సుడులు తిరిగి రాగంగా
ధ్వనించి ప్రతిమనిషి కర్ణ పుటాలలో అమృతపు సోనలను వర్షిస్తుంది. ఆ పద్యంతో కొందరు కావ్యాలు అల్లితే, కొందరు
శతకాలతో నీతి సుధలను కురిపించారు. మరికొందరు ఆ పద్యానికి గద్యాన్ని జతచేసి
అభినయ రూపమిచ్చారు.

‘అదిగో ద్వారక.......
‘బావా ఎప్పుడు వచ్చితీవు’...,
‘చెల్లియో చెల్లక’...........
‘జండాపై కపిరాజు.....’

వంటి వందలాది పద్యాలతో భారత
ఇతివృత్తాన్ని నాటకాలుగా రచించి
అభినయాన్ని జోడు కట్టిన ఖ్యాతిగన్న
జంటకవులు తిరుపతి వేంకట కవులు.

నిరక్షర కుక్షులైన గొడ్లకాడి బుడ్డోళ్లనుండి సాహిత్యాన్ని పుక్కిటబట్టిన పండిత ప్రకాండుల వరకు తన్మయత్వంతో పాడుకోగల కవిత్వాన్ని
రచించి పద్యానికి పట్టాభిషేకం చేసిన
మహనీయులు..., చిరస్మరణీయులు తిరుపతి వేంకట కవులు. ‘సాహిత్య చరిత్రలో సువర్ణాక్షర లిఖితం.

అపూర్వమైన అవధాన విద్యతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించి ఆచంద్ర తారార్కం
తెలుగువారి గుండెల్లో చిరకీర్తి సముపేతులైన తిరుపతి వేంకట కవులు మహాభారత కథను ఆధారంగా చేసుకొని పాండవ జననము, పాండవ ప్రవాసము, పాండవోద్యోగము, పాండవవిజయము, పాండవాశ్వమేధము అనే నాటకాలను రచించి చిరస్మరణీయులయ్యారు.

మహాభారతాన్ని చదవని వారికి సైతం కథను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు నాటకాల ద్వారా వివరించి చరితార్థులయ్యారు.

తెలుగుదనం, తెలుగు నుడికారం, తెలుగు పలుకుబడులను నాటకాలలో గుప్పించి, భాషా మధురిమలను జాతికి పంచిపెట్టారు. నాటకాలతోపాటు శతాధిక గ్రంథాలను, ఆశువుగా వేలాది పద్యాలను చెప్పడమే కాకుండా రాష్ట్రంతోపాటు రాష్ట్రేతర పాంతాలలో కూడా వీరవిహారం చేసి గజారోహణ, గండపెండేర సత్కారాలను పొందారు తిరుపతి వేంకట కవులు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి అక్షర నీరాజనం.

దివాకర్ల తిరుపతి శాస్త్రి 1872 మార్చి 26న
పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వద్ద
యండగండి గ్రామంలో జన్మించారు.

ఆయన తండ్రి వేంకటావధాని కూడా గొప్ప వేదపండితుడు, సూర్యోపాసకుడు. తిరుపతి శాస్త్రి విద్యాభ్యాసం బూర్ల సుబ్బారాయుడు,
గరిమెళ్ళ లింగయ్య, పమ్మి పేరిశాస్త్రి, చర్ల బ్రహ్మయ్య శాస్త్రిల వద్ద సాగింది. చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చదువుకునే సమయంలో తిరుపతి శాస్త్రికి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తోడయ్యారు.

1898లో తిరుపతి శాస్త్రి గారికి వివాహం జరిగింది. అంటే ఆయనకు 26 సంవత్సరాల వయసులో వివాహం అయింది.
తిరుపతి వేంకట కవుల భాష
మృదుమధురమైనది. గద్యాన్ని వ్రాసినా, పద్యాన్ని వ్రాసినా శిష్ట వ్యావహారికం సరసమధురంగా చిందులు వేస్తుంది.

జాతీయాలూ, లోకోక్తులు తిరుపతి వేంకట కవుల నాటకాలలో కుప్పలు తెప్పలుగా కన్పిస్తాయి. పాత్ర పోషణ, రస సంవిధానము, సన్నివేశ కల్పన, సంభాషణా చాతుర్యమునందు తిరుపతి వేంకట కవులు ప్రతిభ అనన్య సామాన్యమైనది. నాటకం అనే ప్రక్రియను వాడవాడలా పరిచయం చేయడంలో పాండవోద్యోగ విజయాల నాటకం ద్వారా తిరుపతి వేంకట కవుల కృషి చిరస్మరణీయం.

ఉద్యోగ విజయాలను రెండింటినీ కలిపి కురుక్షేత్రం పేరుతో నటులు రాష్ట్రేతర ప్రాంతాలలో కూడా వేలాది ప్రదర్శనలిచ్చారు. ఇన్ని వేల ప్రదర్శనలను పొందిన నాటకం జాతీయ స్థాయిలో లేదంటే అతిశయోక్తి లేదు. 1918లో పోలవరం జమీందార్ మరణం వారిని ఇబ్బందులలో పడవేసింది. అయితే గోలంక వీరవరం జమీందార్ రావు రామాయమ్మ వీరికి
భరణం ఏర్పాటు చేసింది.

పాండవోద్యోగ విజయాలు - పడక సీను ఎంత అద్భుత ముగా పండించారో మహానుభావులు
బావా! యెప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్

నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?

మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ

దేవుల్ సేమంబై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్

బావ! ఎక్కడ నుండి రాక ఇటకు, ఎల్లరులున్ సుఖులే కదా?

ఎసోభాఖులు నీదు అన్నలున్, భవ్య మనస్కులు నీదు తమ్ములను చక్కగనున్నవారే ?

భుజసాలి వృకోదరుడు అగ్రజాగ్య్నకున్ దక్కగా నిల్చి

శాంతు గతి తానూ చరించునే తెలుపుము
అర్జునా, ఎక్కడి నుండి రాక?

పాండవోద్యోగ విజయాలు - రాయబారం

చెల్లియొ చెల్లకొ తమకు జేసినయెగ్గులు సైచిరందరున్

తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధి సేయ, నీ

పిల్లలు పాపలుం ప్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో

యెల్లి రణంబు గూర్చెదవొ? యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా!

జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే

దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం

గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పు డొ

క్కండున్ నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్

కవితా స్నేహ కేతనాన్ని తెలుగునాట ఆచంద్రతారార్కం ఎగిరేట్టు చేసినవారు. అద్యతనాంధ్ర కవిత్వ ప్రపంచ నిర్మాతలు. తిరుపతి వెంకటకవులు. వాళ్లిద్దరూ ‘జంట కవులు’ అనే మాటకు ఉదాహరణ ప్రాయులు.

తిరుపతి వెంకట కవులు అంటే దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి. వీళ్లిద్దరికీ ఒకళ్లంటే ఒకళ్లకు ప్రాణం. చెళ్లపిళ్ల వారికన్నా ముందు తిరుపతిశాస్త్రి దివంగతుల య్యారు. అయితే వారి కవితాస్నేహాన్ని మృత్యువు సైతం విడదీయలేకపోయింది. తమ కవిత్వంలో తిరుపతిశాస్త్రిని చిరంజీవిని చేశారు చెళ్లపిళ్ల.

'జాతస్య హి ధ్రువో మృత్యుః' అని భగవద్గీతలో భగవానుడు చెప్పినట్లు పుట్టినవాని మరణము తప్పదు అన్నట్లు తెలుగునాట పద్యకేతనం ఎగురవేసిన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి నోట పద్యం శాశ్వతంగా మూగబోయింది. మధుమేహం వ్యాధి కారణంగా ఆయన 1920 నవంబరులో మరణించారు. కేవలం 47 ఏళ్ళ వయసులోనే వారికి మరణం సంభవించింది. ఏదిఏమైనా ఆనాటి తరం నాలుకలపై ఉన్న తిరుపతి వేంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి పేరు ఈ నాటి తరానికి కూడా తెలియాలి. ఆ మహానుభావుని జన్మదినం పురస్కరించుకుని ప్రతి తెలుగువారు ప్రతి తెలుగు భాషాభిమాని నివాళులు అర్పించాలని మనసారా కోరుకుంటూ...దివాకర్ల తిరుపతి శాస్త్రి గారికి నివాళులర్పిస్తున్నాము.
----
శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు
మానికొండ రాజశేఖర్ శర్మ

Post a Comment

0 Comments

Advertisement